Monday, May 21, 2018

ఎంత పరమ బంధుడవో!


Audio link by Sri Sattiraju Venumadhav garu: https://archive.org/details/EntaParamaBandhudavoSriSattirajuVenuMadhavSriVinnakotaMuraliKrishna1


మనము ఒక్క పూట ఆఫీసు పని సరిగా చెయ్యకపోతే మన పై అధికారులు మనని సంజాయిషీ అడుగుతారు. ఇంటిలో ఒక్క రోజు పనులు చెయ్యకపోతే, లేదా వారితో సమయం గడపకపోతే ఇంట్లోనివారు అలుగుతారు. మన ఇంటికి వఛ్చిన బంధువులతో మనం సమయం గడపకపోతే వారు చిన్నబుచ్చుకుంటారు. మనమే ఒక వేళ మరొకరి ఇంటిలో ఉంటూ ఆ ఇంటి వారితో సరిగా మాట్లాడకుండా ఉంటే అప్పుడు మన యెడల వారి ప్రవర్తన/భావన ఎలా ఉంటాయి? 

సర్వాంతర్యామిగా మన లోపల, మన బయటా ఉంటూ, మన ఉనికికి కారణభూతుడై ఉన్న భగవంతుడితో గడపడానికి మనకు సమయం ఉండదు. అయినా ఆయన మనపై ఏనాడూ కోపగించడు. పైగా మననుండి ఏ గుర్తింపును కోరకుండా తానే మనకు నిరంతరమూ సేవ చేస్తుంటాడు! మనలో జఠరాగ్ని  రూపంలో ఉండి మనం తింటున్న ఆహారాన్ని జీర్ణం చెయ్యడం, పంచేంద్రియాలద్వారా సృష్టిలో మనచుట్టూ జరుగుతున్న వాటిని గుర్తించే సామర్ధ్యాలను ప్రసాదించడం, కర్మేంద్రియాలద్వారా పనిచేయగలిగిన శక్తిని ఇవ్వడం, మన ప్రయత్నంతో పని లేకుండా నిరవధికంగా మనలో కొట్టుకొంటున్న గుండె, జరుగుతున్న రక్త ప్రసారం, శ్వాసక్రియ - ఇవన్నీ భగవంతుడు మౌనంగా మనకు చేస్తున్న సేవలే కదా! ఇలా మననుండి ఏమీ, కనీసం కృతజ్ఞత కూడా, ఆశించక, మనకు ఇంత మేలుచేస్తున్న భగవంతుడికంటే పరమ-బంధువు మనకు ఇంక ఎవరు ఉంటారు? 

పరమ బంధువైన భగవంతుడు మనకు ఎన్ని విధాలుగా సహాయం చేస్తున్నాడో, అట్టి భగవంతుణ్ణి ప్రేమతో స్మరించుకోకపోవడం ఎంతటి అపరాధమో తెల్పుతూ, అన్నమాచార్యులవారి పుత్రుడైన శ్రీ పెద-తిరుమలాచార్యులవారు వ్రాసిన కీర్తన ఇది: 


ఎంత పరమబంధుఁడవో యేమని వినుతింతు మిమ్ము
అంత నిన్ను మఱచి నే నపరాధి నైతిని ॥పల్లవి॥

దురితములే నేఁజేసి దుఁఖముఁబొందేనాఁడు
తొరలి నన్ను రోసి తొలఁగ వైతి
నరకము చొచ్చేనాఁడు నాకు నంతర్యామివై
పరుఁడు వీఁడేల యనక సాయమైతివిగా ॥ఎంత॥

జనని గర్భమునందు చెరబడి వుండేనాఁడు
వెనుబలమువై నన్ను విడువ వైతి
పెనఁగి పంచేంద్రియాలు పిరువీఁకులయ్యెనాఁడు
అనుభవింపఁగఁ జేసి అందుకు లోనైతివి॥ఎంత॥

యెట్టు నేఁగోరిన అది యిచ్చి పరతంత్రుఁడవై
మెట్టుకొని నా యిచ్చలో మెలఁగితివి
యిట్టే యీ జన్మమున నన్నేలి శ్రీవేంకటేశ
పట్టి నీ దాసులలోఁ దప్పక మన్నించితివి॥ఎంత॥

కొన్ని పదములకు అర్ధములు:
రోసి = తిరస్కరించి
చెరబడి = బంధింపబడి
పిరువీఁకులయ్యెనాఁడు = అవస్థలు పడుతున్నప్పుడు

భావము:

ఎంతటి పరమ బంధువువో, నిన్ను ఏమని కీర్తించగలను? అట్టి నిన్ను మరచిపోయి నేను అపరాధిని ఐతిని!

నేను పాప కర్మలు చేసి దుఃఖమును అనుభవిస్తున్నప్పుడుకూడా, నాపై విసుగు చెందక, నన్ను విడిచిపెట్టక నాతోనే ఉంటున్నావు. చేసిన దుష్కర్మల ఫలితముగా నరకమునకు పోవలసి వఛ్చినప్పుడుకూడా - వీని సంగతి మనకెందుకు - అని అనుకోకుండా, అంతర్యామిగా నాతోనే ఉండి సాయము చేస్తున్నావు. 

తల్లి గర్భములో శిశువుగా ఒంటరిగా ఉన్నప్పుడుకూడా, నా వెనుక బలముగా నువ్వే ఉంటూ, నన్ను సంరక్షించుకున్నావు. ఇంద్రియ చాపల్యముల పెనుగులాటలతో నేను అవస్థలు పడుతున్నప్పుడు, నాకు ఇంద్రియార్థములను అనుభవింపజేస్తూ, అప్పుడుకూడా అంతర్యామిగా నీవు నాతోనే ఉంటున్నావు. 

నేను కోరినవి అన్నీ  నాకు అందజేస్తూ నీవు నాకు బానిసగా ఉంటున్నావు! నా ఇష్టానుసారంగా నువ్వు నాతో  మెలుగుతున్నావు. జన్మ జన్ములుగా ఇలా పాపములు చేస్తున్న నన్ను మన్నించి, ఓ శ్రీ వేంకటేశా, ఈ జన్మలో నువ్వే నన్ను ఏలుకొని  (నడిపించి)., నన్ను నీ దాసునిగా చేసుకోవయ్యా. 

Saturday, May 19, 2018

అయ్యో పోయఁ బ్రాయముఁ గాలము



అన్నమాచార్యునకు బాల్యమున - తల్లిదండ్రులు, అన్నలు, వదినలు పనులు చెప్పుటయు, భగవత్భక్తి పరాయణుడైన అతడు వానిని చేయజాలక చికాకు పడుటయు జరుగుచుండెను. కుటుంబము వారి వలన తాను చికాకు పొందుటను సూచించు సంకీర్తనములు కొన్ని అన్నమాచార్య సంకీర్తనములలో కలవు. 

అందొకటి ఇక్కడ చూడగలరు:


అయ్యో పోయఁ బ్రాయముఁ గాలము
ముయ్యంచు మనసున నే మోహమతినైతి ॥పల్లవి॥


చుట్టంబులా తనకు సుతులుఁ గాంతలుఁ జెలులు
వట్టి యాసలఁ బెట్టువారే కాక
నెట్టుకొని వీరు గడు నిజమనుచు హరి నాత్మఁ
బెట్టనేరక వృధా పిరివీకులైతి ॥అయ్యో॥


తగుబంధులా తనకుఁ దల్లులునుఁ దండ్రులును
వగలఁ బెట్టుచుఁ దిరుగువారే కాక
మిగుల వీరలపొందు మేలనుచు హరినాత్మఁ
దగిలించ లేక చింతాపరుఁడనైతి ॥అయ్యో॥



అంత హితులా తనకు నన్నలునుఁ దమ్ములును
వంతువాసికిఁ బెనఁగువారే కాక
అంతరాత్ముఁడు శ్రీవేంకటాద్రీశుఁ గొలువ కిటు
సంత కూటముల యలజడికి లోనైతి॥అయ్యో॥



కొన్ని పదముల వివరణలు:

(1) ముయ్యంచు మనసు = మూడు అంచులు గల మనస్సు. త్రిగుణాత్మకమైన మనస్సు అనే అర్ధములో చెప్పి ఉండవచ్చు.
(2) పిరివీకు = పీకులాట, రచ్చ, జంఝాటము, బాధ 
(3) వగలఁ బెట్టుచుఁ = మాయ చేయుచు 
(4) వాసి =  లాభము, ఆధిక్యము, ప్రసిద్ధి  


భావము:

అయ్యో! వయస్సు, కాలము వ్యర్థముగా గడిచిపోయాయి.  నా మనస్సు చేసిన మాయ వలన మొహములో పడిపోయాను. 

భార్యా, పిల్లలు, స్నేహితులు మనకు ఆశలను కల్పించువారేగానీ, వారు నిజమైన చుట్టములా?   వారే నిజమనుకుని, శ్రీహరిని ఆత్మయందు ధ్యానించక వ్యర్ధమైన పీకులాటలలో కాలము వయస్సు  గడిపితిని, అయ్యో!

తల్లిదండ్రులు మాయలో పడవేయువారే గానీ, వారు నిజమైన ఆత్మ బంధువులా? వారిని సంతోషపెట్టడమే పరమావధిగా జీవించుచు, ఆత్మయందు శ్రీహరిని ప్రతిష్టించుకొనక, చింతాక్రాంతుడను ఐతిని, అయ్యో!

అన్నదమ్ములు వంతులకు వచ్చి వారి స్వలాభంకోసం పెనుగులాడేవారేగానీ, వారు మనకు నిజమైన హితులా? అంతరాత్మయందు ఉన్న శ్రీ వేంకటేశ్వరుని కొలవక, సంతల  గుంపులో ఉండు గందరగోళమువలే   అలజడికి లోనైతిని, అయ్యో!

ఇతరులకు నిను నెరుగతరమా?

ఇతరులకు నిను నెరుగతరమా? - అన్నమయ్య సంకీర్తన 



ఇతరులకు నిను నెరుగతరమా
సతత సత్యవ్రతులు సంపూర్ణమోహవిర-
హితు లెఱుగుఁదురు నిను నిందిరారమణా ॥పల్లవి॥


నారీకటాక్షపటు నారాచభయరహిత-
శూరులెఱుఁగుదురు నినుఁ చూచేటి చూపు
ఘోరసంసార సంకులపరిచ్ఛేదులగు-
ధీరులెఱుఁగుదురు నీదివ్యవిగ్రహము ॥ఇతరు॥

రాగభోగవిదూర రంజితాత్ములు మహా-
భాగు లెరుఁగుదురు నినుఁ బ్రణుతించువిధము
ఆగమోక్త ప్రకారాభిగమ్యులు మహా-
యోగులెఱుఁగుదురు నీవుండేటివునికి ॥ఇతరు॥

పరమభాగవత పదపద్మసేవానిజా-
భరణులెఱుఁగుదురు నీ పలికేటిపలుకు
పరగు నిత్యానంద పరిపూర్ణ మానస-

స్థిరు లెఱుఁగుదురు నినుఁ దిరువేంకటేశ ॥ఇతరు॥


చాలా గంభీరమైన భావంగల కీర్తన ఇది! 

నిరంతరము సత్య వస్తువును (పరబ్రహ్మమును) ధ్యానించుటయే వ్రతముగా కలిగినవారు, మోహము  ఇత్యాది అరిషడ్వర్గములనుండి సంపూర్ణముగా విడివడినవారు మాత్రమే నీ గురించి తెలుసుకొనగలరు. మిగిలిన వారికి నీ గూర్చి తెలుసుకోవడం సాధ్యమయ్యే పనేనా?

ఆడవారి ఓరచూపులు అనే పదునైన బాణములపట్ల భయ రహితులైన శూరులు (కామమును జయించినవారు) మాత్రమే నిన్ను చూసే  చూపు కలిగి యుంటారు. ఘోరమైన సంసారము (నానాత్వము) అనెడి సంకెళ్లను త్రెంచుకున్న ధీరులైనవారు మాత్రమే నీ దివ్యమైన విగ్రహమును ఎఱుగుదురు. 
     
ఇష్టాఇష్టములనుండి, భోగాసక్తి నుండి విముక్తులైన మహనీయులు మాత్రమే నిన్ను ప్రార్ధించు విధమును ఎఱిగియున్నారు. వేదా శాస్త్రములయందు తెలుపబడిన రీతిన సాధన చేయుచున్న యోగులు మాత్రమే నీయొక్క ఉనికిని ఎఱుగుదురు.

పరమ భాగవతుల యొక్క పాదపద్మములను భక్తితో సేవించి ధన్యులైన వారే నీవు పలికే పలుకులను ఎఱుగగలరు (గ్రహించగలరు). ఓ వెంకటేశ్వరా! శాశ్వత ఆనందమును అనుభవించు స్థిత ప్రజ్ఞులైనవారు (మాత్రమే!) నిన్ను ఎఱుగగలరు.