Monday, May 21, 2018

ఎంత పరమ బంధుడవో!


Audio link by Sri Sattiraju Venumadhav garu: https://archive.org/details/EntaParamaBandhudavoSriSattirajuVenuMadhavSriVinnakotaMuraliKrishna1


మనము ఒక్క పూట ఆఫీసు పని సరిగా చెయ్యకపోతే మన పై అధికారులు మనని సంజాయిషీ అడుగుతారు. ఇంటిలో ఒక్క రోజు పనులు చెయ్యకపోతే, లేదా వారితో సమయం గడపకపోతే ఇంట్లోనివారు అలుగుతారు. మన ఇంటికి వఛ్చిన బంధువులతో మనం సమయం గడపకపోతే వారు చిన్నబుచ్చుకుంటారు. మనమే ఒక వేళ మరొకరి ఇంటిలో ఉంటూ ఆ ఇంటి వారితో సరిగా మాట్లాడకుండా ఉంటే అప్పుడు మన యెడల వారి ప్రవర్తన/భావన ఎలా ఉంటాయి? 

సర్వాంతర్యామిగా మన లోపల, మన బయటా ఉంటూ, మన ఉనికికి కారణభూతుడై ఉన్న భగవంతుడితో గడపడానికి మనకు సమయం ఉండదు. అయినా ఆయన మనపై ఏనాడూ కోపగించడు. పైగా మననుండి ఏ గుర్తింపును కోరకుండా తానే మనకు నిరంతరమూ సేవ చేస్తుంటాడు! మనలో జఠరాగ్ని  రూపంలో ఉండి మనం తింటున్న ఆహారాన్ని జీర్ణం చెయ్యడం, పంచేంద్రియాలద్వారా సృష్టిలో మనచుట్టూ జరుగుతున్న వాటిని గుర్తించే సామర్ధ్యాలను ప్రసాదించడం, కర్మేంద్రియాలద్వారా పనిచేయగలిగిన శక్తిని ఇవ్వడం, మన ప్రయత్నంతో పని లేకుండా నిరవధికంగా మనలో కొట్టుకొంటున్న గుండె, జరుగుతున్న రక్త ప్రసారం, శ్వాసక్రియ - ఇవన్నీ భగవంతుడు మౌనంగా మనకు చేస్తున్న సేవలే కదా! ఇలా మననుండి ఏమీ, కనీసం కృతజ్ఞత కూడా, ఆశించక, మనకు ఇంత మేలుచేస్తున్న భగవంతుడికంటే పరమ-బంధువు మనకు ఇంక ఎవరు ఉంటారు? 

పరమ బంధువైన భగవంతుడు మనకు ఎన్ని విధాలుగా సహాయం చేస్తున్నాడో, అట్టి భగవంతుణ్ణి ప్రేమతో స్మరించుకోకపోవడం ఎంతటి అపరాధమో తెల్పుతూ, అన్నమాచార్యులవారి పుత్రుడైన శ్రీ పెద-తిరుమలాచార్యులవారు వ్రాసిన కీర్తన ఇది: 


ఎంత పరమబంధుఁడవో యేమని వినుతింతు మిమ్ము
అంత నిన్ను మఱచి నే నపరాధి నైతిని ॥పల్లవి॥

దురితములే నేఁజేసి దుఁఖముఁబొందేనాఁడు
తొరలి నన్ను రోసి తొలఁగ వైతి
నరకము చొచ్చేనాఁడు నాకు నంతర్యామివై
పరుఁడు వీఁడేల యనక సాయమైతివిగా ॥ఎంత॥

జనని గర్భమునందు చెరబడి వుండేనాఁడు
వెనుబలమువై నన్ను విడువ వైతి
పెనఁగి పంచేంద్రియాలు పిరువీఁకులయ్యెనాఁడు
అనుభవింపఁగఁ జేసి అందుకు లోనైతివి॥ఎంత॥

యెట్టు నేఁగోరిన అది యిచ్చి పరతంత్రుఁడవై
మెట్టుకొని నా యిచ్చలో మెలఁగితివి
యిట్టే యీ జన్మమున నన్నేలి శ్రీవేంకటేశ
పట్టి నీ దాసులలోఁ దప్పక మన్నించితివి॥ఎంత॥

కొన్ని పదములకు అర్ధములు:
రోసి = తిరస్కరించి
చెరబడి = బంధింపబడి
పిరువీఁకులయ్యెనాఁడు = అవస్థలు పడుతున్నప్పుడు

భావము:

ఎంతటి పరమ బంధువువో, నిన్ను ఏమని కీర్తించగలను? అట్టి నిన్ను మరచిపోయి నేను అపరాధిని ఐతిని!

నేను పాప కర్మలు చేసి దుఃఖమును అనుభవిస్తున్నప్పుడుకూడా, నాపై విసుగు చెందక, నన్ను విడిచిపెట్టక నాతోనే ఉంటున్నావు. చేసిన దుష్కర్మల ఫలితముగా నరకమునకు పోవలసి వఛ్చినప్పుడుకూడా - వీని సంగతి మనకెందుకు - అని అనుకోకుండా, అంతర్యామిగా నాతోనే ఉండి సాయము చేస్తున్నావు. 

తల్లి గర్భములో శిశువుగా ఒంటరిగా ఉన్నప్పుడుకూడా, నా వెనుక బలముగా నువ్వే ఉంటూ, నన్ను సంరక్షించుకున్నావు. ఇంద్రియ చాపల్యముల పెనుగులాటలతో నేను అవస్థలు పడుతున్నప్పుడు, నాకు ఇంద్రియార్థములను అనుభవింపజేస్తూ, అప్పుడుకూడా అంతర్యామిగా నీవు నాతోనే ఉంటున్నావు. 

నేను కోరినవి అన్నీ  నాకు అందజేస్తూ నీవు నాకు బానిసగా ఉంటున్నావు! నా ఇష్టానుసారంగా నువ్వు నాతో  మెలుగుతున్నావు. జన్మ జన్ములుగా ఇలా పాపములు చేస్తున్న నన్ను మన్నించి, ఓ శ్రీ వేంకటేశా, ఈ జన్మలో నువ్వే నన్ను ఏలుకొని  (నడిపించి)., నన్ను నీ దాసునిగా చేసుకోవయ్యా. 

No comments:

Post a Comment