Saturday, May 19, 2018

అయ్యో పోయఁ బ్రాయముఁ గాలము



అన్నమాచార్యునకు బాల్యమున - తల్లిదండ్రులు, అన్నలు, వదినలు పనులు చెప్పుటయు, భగవత్భక్తి పరాయణుడైన అతడు వానిని చేయజాలక చికాకు పడుటయు జరుగుచుండెను. కుటుంబము వారి వలన తాను చికాకు పొందుటను సూచించు సంకీర్తనములు కొన్ని అన్నమాచార్య సంకీర్తనములలో కలవు. 

అందొకటి ఇక్కడ చూడగలరు:


అయ్యో పోయఁ బ్రాయముఁ గాలము
ముయ్యంచు మనసున నే మోహమతినైతి ॥పల్లవి॥


చుట్టంబులా తనకు సుతులుఁ గాంతలుఁ జెలులు
వట్టి యాసలఁ బెట్టువారే కాక
నెట్టుకొని వీరు గడు నిజమనుచు హరి నాత్మఁ
బెట్టనేరక వృధా పిరివీకులైతి ॥అయ్యో॥


తగుబంధులా తనకుఁ దల్లులునుఁ దండ్రులును
వగలఁ బెట్టుచుఁ దిరుగువారే కాక
మిగుల వీరలపొందు మేలనుచు హరినాత్మఁ
దగిలించ లేక చింతాపరుఁడనైతి ॥అయ్యో॥



అంత హితులా తనకు నన్నలునుఁ దమ్ములును
వంతువాసికిఁ బెనఁగువారే కాక
అంతరాత్ముఁడు శ్రీవేంకటాద్రీశుఁ గొలువ కిటు
సంత కూటముల యలజడికి లోనైతి॥అయ్యో॥



కొన్ని పదముల వివరణలు:

(1) ముయ్యంచు మనసు = మూడు అంచులు గల మనస్సు. త్రిగుణాత్మకమైన మనస్సు అనే అర్ధములో చెప్పి ఉండవచ్చు.
(2) పిరివీకు = పీకులాట, రచ్చ, జంఝాటము, బాధ 
(3) వగలఁ బెట్టుచుఁ = మాయ చేయుచు 
(4) వాసి =  లాభము, ఆధిక్యము, ప్రసిద్ధి  


భావము:

అయ్యో! వయస్సు, కాలము వ్యర్థముగా గడిచిపోయాయి.  నా మనస్సు చేసిన మాయ వలన మొహములో పడిపోయాను. 

భార్యా, పిల్లలు, స్నేహితులు మనకు ఆశలను కల్పించువారేగానీ, వారు నిజమైన చుట్టములా?   వారే నిజమనుకుని, శ్రీహరిని ఆత్మయందు ధ్యానించక వ్యర్ధమైన పీకులాటలలో కాలము వయస్సు  గడిపితిని, అయ్యో!

తల్లిదండ్రులు మాయలో పడవేయువారే గానీ, వారు నిజమైన ఆత్మ బంధువులా? వారిని సంతోషపెట్టడమే పరమావధిగా జీవించుచు, ఆత్మయందు శ్రీహరిని ప్రతిష్టించుకొనక, చింతాక్రాంతుడను ఐతిని, అయ్యో!

అన్నదమ్ములు వంతులకు వచ్చి వారి స్వలాభంకోసం పెనుగులాడేవారేగానీ, వారు మనకు నిజమైన హితులా? అంతరాత్మయందు ఉన్న శ్రీ వేంకటేశ్వరుని కొలవక, సంతల  గుంపులో ఉండు గందరగోళమువలే   అలజడికి లోనైతిని, అయ్యో!

No comments:

Post a Comment